31, డిసెంబర్ 2008, బుధవారం

జ్ఞాపకాల పందిరిలో....!!

వణికించే చలికాలంలో
మొదలయ్యింది యీ సంవత్సరం-
వురికించే ఊహలు రేపింది!
" ఒకే సంవత్సరంలో
మూడు సెమిస్టర్లు!!
ఒక్కోటీ ఒక్కో
అందమైన అనుభవం.
ఆటలూ-పాటలూ
పుస్తకాలూ-పాట్లూ
చిన్ని చిన్ని గొడవలూ
బంకేసిన క్లాసులూ
బుక్కయిపోయిన సీన్లూ
మార్నింగ్‌షో టిక్కెట్లూ
ర్యాంప్‌షో డిస్కషన్లూ
జి టాకులో - ఆఫ్‌లైన్లూ
ఏవో సాకులూ - బి.ఆర్.బి లూ
అర్థం లేని మార్కులు-
అదిరిపడే కలలు!
అమ్మాయితో మాటలు-
అందమైన కలలు!!
పేపర్ ప్రెజెంటేషన్లు-
కట్-కాపీ-పేస్టులు!!!
ఎక్జాంలో ముందువాడి పేపర్లూ
విసుగెత్తించే క్లాస్ టాపర్లూ................"

'ఏంటి యీ సంవత్సరం?'
అని వెనక్కి చూస్తే నా మది
నన్ను తిప్పి తీస్కువచ్చింది -
ఈ అందమైన
జ్ఞాపకాల పందిరిలో....!!

21, డిసెంబర్ 2008, ఆదివారం

నీ కోసం నిరీక్షిస్తూ...!!

విరజాజుల వెండి వెన్నెల
విరిసిన గగనపుటంచున
మరలివెళ్ళిన సంధ్యకాంతుల
వింత సోయగాల నడుమ...
నీ ఒడిలో తలవాల్చి
మనసారా కన్న
కమ్మని కలల
అలల తాకిడికి తనువొగ్గుతూ....
మరల మరల
నిను నా మదిలో నింపేస్తూ...
నీ ఊహల నా సౌధపు
ముంగిలిలో నువ్వేసిన
ముగ్గుల ముందర నిల్చొన్నా...!
నీవు రావని తెలిసినా,
నీ కోసం నిరీక్షిస్తూ...!!

7, డిసెంబర్ 2008, ఆదివారం

కళ్యాణమస్తు..!

Sem మొదలవ్వగానే అన్ని కాలేజిల్లోలాగానే మా కాలేజిలో కూడా లెక్చరర్లు లైట్ తీస్కున్నారు. అంతకంటే మాకు ఇంకేం కావాలి చెప్పండి. మేమసలే లైట్...ఇప్పుడు పిచ్చ లైట్ :-). 'ఇంజనీరింగ్ క్లాస్‌రూం ఎలా ఉండాలో మమ్మల్నడగండి' అంటూ వచ్చిన లెక్చరర్ ఇన్-ఛార్జ్ కి చూపించాం..! 

మా అడ్డా మూడో బెంచ్ నుంచి ఏడో బెంచికి మారింది. ఒక చిన్న రౌండ్-టేబుల్ కాన్‌ఫెరెన్స్.  
మొత్తం ఆరుగురం, మా బోర్డ్ మీటింగ్ మొదలయ్యింది. 
"ఏరా ఏంటిరా బాబు ఈ తొక్కలో కాలేజ్..(క్షమించాలి ఇది మా బోర్డ్ పెర్సనల్ ఒపీనియన్ :-) ) ఒక్క క్లాసు కూడా జరగదు, మళ్ళా చివర్లో హడావుడిగా సిలబస్ అవగొట్టేస్తారు ఛీ ....(సెన్సార్ కట్)" విసుగు, అసహనం కూడిన స్వరంలో అన్నాన్నేను. 
"మామా వద్దురా ఇప్పుడు కూడానా! లైట్ తీస్కోరా!!" అంటూ నన్ను కూల్ చెయ్యబోయాడు భగవాన్
"అవును డార్లింగ్ (లైట్) తీస్కో", బగ్గు కూడా జాయినయ్యాడు. "యెహె! ఏదైనా కొత్త టాపిక్ మాట్లాడండి.. ఎప్పుడు చూసినా ఈ కాలేజూ..ఈ సిలబస్సూ..." పడుకున్న సత్తిబాబు విసుగెత్తి లేచాడు. 

ఇంతలో ఏదో గుర్తొచ్చినోడిలా వింటున్న ఐ-పాడ్ ని పాజ్ చేసి, "అరేయ్ మామా! మొన్న నేనూ,నిష్ గాడు పెళ్ళికెళ్ళాం కదా.." అంటూ ఇయర్‌ఫోన్స్ ని తీస్తూ చెప్పాడు సుమ్మీ. అందరూ అలర్ట్ అయ్యారు..ఎదో డి.సి. క్లాస్ మొదలవ్వబోతున్నట్టు (అంటే మా హెచ్.ఒ.డి. వస్తాడు(రు)లెండి ఆ సబ్జెక్టుకి). 'మొన్న పెళ్ళిలో ఏం జరిగిందా?' అని నేను నా ఫ్లాష్ మెమొరీని స్కాన్ చేయడం మొదలుపెట్టా. 'ఏమైందిరా?' అన్నట్టు భగవాన్ చూశాడు. బగ్గు ఐతే నో చూపులు..జస్ట్ డైలాగ్స్.."ఏంట్రా..!! ఎనీథింగ్.." అంటూ కన్ను కొట్టాడు. సుమ్మీ గాడు నావైపు చూశాడు నేనేదో చేసినట్టు..! నేను ఉలిక్కిపడి "డార్లింగ్ నాకేం తెలియదురా...!" అనేసా, 'స్వాతిముత్యం'లో కమల్ హాసన్‌లా..!! "యెహె నమ్మేసాం కాని నువ్వు మ్యాటర్ కి రారా.." అంటూ సత్తి గాడు సుమ్మీ వైపు చూసాడు. చిన్న చిరునవ్వుతో 'విషయంలోని విశేషమేంటో విలంబించక వివరించమని' వ్యక్తపరిచాడు రెడ్డి. ఇంత సీన్ అవసరమా అన్నట్టు నేను వాడిని చూస్తుంటే ఇంక చెప్పడం మొదలుపెట్టాడు. 

"ఏం లేదురా, మొన్న పెళ్ళికి వెళ్ళాం కదా, అక్కడ కపుల్ ని చూసి ఇద్దరం ఒకటే ఫీల్ అయ్యాం 'పెర్ఫెక్ట్' అని. మామా! నిజంరా.. వాళ్ళిద్దరూ ఎక్కడా కొత్తగా పరిచయమైనట్టు లేరురా..! మేం ఫోటో దిగాం కదా అప్పుడు చక్కగా ఒకరిచేతులు ఒకరు పట్టుకొని... అబ్బా.. ఇట్స్ ఎ స్ట్రేంజ్ ఫీల్ రా..!!" అంటూ సుమ్మీ గాడు నామీద పడిపోయాడు. ఏనుగుపిల్ల కింద పడిన బల్లిపిల్లలా ఉంది నా పరిస్థితి. అతికష్టమ్మీద రెండు చేతులతో వాడిని తోస్తూ ఉంటే, సత్తిబాబు డిక్లేర్ చేసాడు "ఏమైనా లవ్ మ్యారేజ్ కంటే అరేంజ్‌డ్ మ్యారేజే బెస్ట్ రా..!".భగవాన్ వేంనే రెస్పాండ్ అయ్యాడు, "అంతేం లేదు, మామా అసలేం తెలియకుండా ఒక స్ట్రేంజెర్ ని ఎలారా..!!??". "మరీ అంత ఇష్టాయిష్టాలు తెలుసుకోకుండా ఎలా చేసుకుంటారులేరా..!" పాత సినిమాలో హీరోలా భారంగా అన్నాన్నేను

"నువ్వెన్నైనా చెప్పు డార్లింగ్! లవ్ మ్యారేజ్ బెస్ట్ రా" చేత్తో ఫైనలైజ్ చేశేసాడు బగ్గు. "అవుననుకో బాబాయ్, కానీ ఈ లవ్వు గివ్వు అంటే కష్టమేరా...!" బెంచ్కి ఆనుకుంటూ చెప్పాడు సుమ్మీ. 'ఇవన్నీ ఎందుకురా ఇంట్లోవాళ్ళు చూపించిన పిల్లని చేసుకోవడం మంచిది' అన్నట్టు చూసాడు రెడ్డి. ఇలా ఒక పావుగంట పైగానే మాట(దెబ్బ)లాడుకున్నాం. ఇంక ఇలాగే వదిలేస్తే కష్టం అని ఫీల్ అయ్యి క్లించ్ ఇచ్చా, "అరేయ్ మామా! కూల్ రా, ఏ పెళ్ళైనా ముందు ఒకరి భావాలు ఒకరికి నచ్చాలి కదరా... సెల్ఫ్ అండ్ మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండాలి కదా..!.." అంటూ ఒక ఐదు నిమిషాలు మాట్లాడా, ఏదో గత జన్మలో పది-పదిహేను పెళ్ళిళ్ళు అయినోడిలా..! ;-) 

ఇంతలో క్లాస్ అంతా అలెర్ట్ ఐంది... ఆర్.ఎఫ్. క్లాస్ మొదలయ్యింది... మా బోర్డ్ మీటింగ్ ఐపోయింది. మేం నెమ్మదిగా మూడో బెంచ్కి జారుకున్నాం. సార్ బోర్డువైపు (మా బోర్డ్ కాదులెండి..బ్లాక్‌బోర్డ్) తిరిగి చాక్ తో రాసారు.."Two cavity klystron". సత్తిబాబు వేసిన జోక్‌కి వస్తున్న నవ్వుని ఆపుకుంటుంటే వెనక నుంచి భగవాన్ 'కళ్యాణమస్తు' అన్నాడు..