22, జూన్ 2010, మంగళవారం

హ్యాపీ డేస్ - 1



పెనవేసుకున్న పరిచయాలెన్నో
కలిసి గోల చేసిన క్షణాలెన్నో
ఒక్కో క్షణం అక్షరం
ఆ ఆస్వాదనతో చిరంజీవులం మేం...!

ఇంజనీరింగ్ కాలేజీ....
ర్యాగింగ్ బాగా చేస్తారంట! ఎక్జామ్స్ కి మనమే చదువుకోవాలంట (12 ఏళ్ల అలవాటుకి విరుద్ధంగా)! సైట్ బాగా కొట్టొచ్చంట! లెక్చరర్స్ లైట్ అంట!..... ఇవే నా ముందున్న ఫీలింగ్స్... నాలుగేళ్ల క్రితం.
మూడు నెలల సుదీర్ఘ విరామం తర్వాత పొద్దున్నే లేవాల్సి వచ్చింది. టైం అవుతుంది అని కాదు, ఏదో కొత్త ప్రపంచంలోంకి పడిపోయినట్టు, చుట్టూ అందరూ పెదపే..ద్ద మనుషులు నడుం మీద చేతులేస్కోని నాకోసం కాస్కొని చూస్తున్నట్టు..., బిక్కుబిక్కుమంటూ అడుగులేస్తుంటే, వెనకనుంచి ఎవరో అరిచేసరికి ఉలిక్కిపడి లేచా. అది కలో, కాసేపట్లో నిజమయ్యే భ్రమో తేల్చుకోలేని సందిగ్ధం.
5-30 కి ఎవడైనా లేస్తాడా...? అసలు అలా లేస్తే వాడు చదివేది ఇంజనీరింగేనా..? లేస్తే లేచాడు, 7-30 కి కాలేజిలో ఉండాలా? ఇదేం కాలేజ్...!!? ఫ్రెండ్స్ కామెంట్స్.  ఎమ్సెట్ ప్రిపరేషన్ అప్పుడు కూడా ఇంత పొద్దున్నే లేవలేదు. పర్లేదు థ్రిల్లింగ్ గానే ఉంది. పొద్దున్నే లేవడం=బస్ స్టాప్ కి వెళ్లి వెయిట్ చేయడం-గంటసేపు ప్రయాణం. ఇట్స్ కూల్.
పొద్దున్నే ప్రకృతి అందాలు చూసి పరవశించాం. అఫ్కోర్స్, నిద్రపోయేవాళ్ళు పోతూనే ఉన్నారు. కానీ తెల్లవారుఝామున హైవే మీద ప్రయాణం, చుట్టూ అంత పచ్చనిదనమే (నాలుగేళ్ళ క్రితం NH-5 ఎక్స్టెండ్ చేయకముందు), ఆ అంతులేని పచ్చదనం చివర్లో అందమైన ఇనబింబం. ఇంత అందమైన ప్రకృతి ఆస్వాదనలో ఒక సంవత్సరం ఎలా గడిచిందో తెలియలేదు.
గుర్రుపెట్టి నిద్దరోతున్నోణ్ణి
గుచ్చి లేపే సంధ్యా కిరణాలు
ఐపాడ్ లో పాటల్ని
మింగేసే మా బస్సు గుర్ గుర్ లు
బయట పడే వర్షాన్ని ఆపలేని
మా బస్సు మెయిన్టెనెన్స్
మా బండి వేగాన్ని తగ్గిస్తూ
ఆ టోల్ గేట్ డిస్టర్బెన్స్
అన్నీ ఇబ్బందులే అయినా
ఆ ఆనంద క్షణాలు
ఆ మధురానుభూతులు
తిరిగిరావు... చెదిరిపోవు
కానీ మొదటిరోజు మాత్రం ఒక మరిచిపోలేని అనుభూతి. జీవితంలో తొలి అనుభవాలు అలా గుర్తుండిపోతాయేమో.
మొదటిరోజు కాలేజ్ లో దిగాక అంత కొత్తగా ఉంది. కొత్త బంగారులోకం కాదు. కొత్త కంగారులోకం అది.
*   *   *   *   *
కౌన్సిలింగ్ అయ్యాక ఒకసారి కాలేజ్ చూసొద్దామని నాన్న, నేనూ బయల్దేరాం. KLCE ...... అడ్రస్ తెలీదు. ఫోన్ చేస్తే రెండుసార్లు రెండు దార్లు చెప్పారు. GNT-VIJ, GNT-TEL. సర్లే మధ్యలో ఉంది కదా అని మంగళగిరిలో దిగేసాం. అక్కడ ఒక కండక్టరుని అడిగితే దారి చెప్పారు.


మాంత్రికుడు వాడి ప్రాణం దాచినట్టు, ఎక్కడో విసిరేసినట్టు ఉంది మా కాలేజ్. ఎంట్రన్స్ లో బోర్డ్ చాలా పాతది. గేటు మాత్రం కోట గుమ్మం లాగా ఉంది. అక్కడే భయం మొదలైంది. లోపల కెళ్తే ఒక్క బిల్డింగూ కనబడలేదు.అంతా చెట్లే, గ్రీ...న్. ఇంక నాలుగేళ్ళు ఈ అడవితల్లికి అంకితం నా జీవితం అనుకున్నా.



సశేషం...

1 కామెంట్‌: