31, డిసెంబర్ 2008, బుధవారం

జ్ఞాపకాల పందిరిలో....!!

వణికించే చలికాలంలో
మొదలయ్యింది యీ సంవత్సరం-
వురికించే ఊహలు రేపింది!
" ఒకే సంవత్సరంలో
మూడు సెమిస్టర్లు!!
ఒక్కోటీ ఒక్కో
అందమైన అనుభవం.
ఆటలూ-పాటలూ
పుస్తకాలూ-పాట్లూ
చిన్ని చిన్ని గొడవలూ
బంకేసిన క్లాసులూ
బుక్కయిపోయిన సీన్లూ
మార్నింగ్‌షో టిక్కెట్లూ
ర్యాంప్‌షో డిస్కషన్లూ
జి టాకులో - ఆఫ్‌లైన్లూ
ఏవో సాకులూ - బి.ఆర్.బి లూ
అర్థం లేని మార్కులు-
అదిరిపడే కలలు!
అమ్మాయితో మాటలు-
అందమైన కలలు!!
పేపర్ ప్రెజెంటేషన్లు-
కట్-కాపీ-పేస్టులు!!!
ఎక్జాంలో ముందువాడి పేపర్లూ
విసుగెత్తించే క్లాస్ టాపర్లూ................"

'ఏంటి యీ సంవత్సరం?'
అని వెనక్కి చూస్తే నా మది
నన్ను తిప్పి తీస్కువచ్చింది -
ఈ అందమైన
జ్ఞాపకాల పందిరిలో....!!

21, డిసెంబర్ 2008, ఆదివారం

నీ కోసం నిరీక్షిస్తూ...!!

విరజాజుల వెండి వెన్నెల
విరిసిన గగనపుటంచున
మరలివెళ్ళిన సంధ్యకాంతుల
వింత సోయగాల నడుమ...
నీ ఒడిలో తలవాల్చి
మనసారా కన్న
కమ్మని కలల
అలల తాకిడికి తనువొగ్గుతూ....
మరల మరల
నిను నా మదిలో నింపేస్తూ...
నీ ఊహల నా సౌధపు
ముంగిలిలో నువ్వేసిన
ముగ్గుల ముందర నిల్చొన్నా...!
నీవు రావని తెలిసినా,
నీ కోసం నిరీక్షిస్తూ...!!

7, డిసెంబర్ 2008, ఆదివారం

కళ్యాణమస్తు..!

Sem మొదలవ్వగానే అన్ని కాలేజిల్లోలాగానే మా కాలేజిలో కూడా లెక్చరర్లు లైట్ తీస్కున్నారు. అంతకంటే మాకు ఇంకేం కావాలి చెప్పండి. మేమసలే లైట్...ఇప్పుడు పిచ్చ లైట్ :-). 'ఇంజనీరింగ్ క్లాస్‌రూం ఎలా ఉండాలో మమ్మల్నడగండి' అంటూ వచ్చిన లెక్చరర్ ఇన్-ఛార్జ్ కి చూపించాం..! 

మా అడ్డా మూడో బెంచ్ నుంచి ఏడో బెంచికి మారింది. ఒక చిన్న రౌండ్-టేబుల్ కాన్‌ఫెరెన్స్.  
మొత్తం ఆరుగురం, మా బోర్డ్ మీటింగ్ మొదలయ్యింది. 
"ఏరా ఏంటిరా బాబు ఈ తొక్కలో కాలేజ్..(క్షమించాలి ఇది మా బోర్డ్ పెర్సనల్ ఒపీనియన్ :-) ) ఒక్క క్లాసు కూడా జరగదు, మళ్ళా చివర్లో హడావుడిగా సిలబస్ అవగొట్టేస్తారు ఛీ ....(సెన్సార్ కట్)" విసుగు, అసహనం కూడిన స్వరంలో అన్నాన్నేను. 
"మామా వద్దురా ఇప్పుడు కూడానా! లైట్ తీస్కోరా!!" అంటూ నన్ను కూల్ చెయ్యబోయాడు భగవాన్
"అవును డార్లింగ్ (లైట్) తీస్కో", బగ్గు కూడా జాయినయ్యాడు. "యెహె! ఏదైనా కొత్త టాపిక్ మాట్లాడండి.. ఎప్పుడు చూసినా ఈ కాలేజూ..ఈ సిలబస్సూ..." పడుకున్న సత్తిబాబు విసుగెత్తి లేచాడు. 

ఇంతలో ఏదో గుర్తొచ్చినోడిలా వింటున్న ఐ-పాడ్ ని పాజ్ చేసి, "అరేయ్ మామా! మొన్న నేనూ,నిష్ గాడు పెళ్ళికెళ్ళాం కదా.." అంటూ ఇయర్‌ఫోన్స్ ని తీస్తూ చెప్పాడు సుమ్మీ. అందరూ అలర్ట్ అయ్యారు..ఎదో డి.సి. క్లాస్ మొదలవ్వబోతున్నట్టు (అంటే మా హెచ్.ఒ.డి. వస్తాడు(రు)లెండి ఆ సబ్జెక్టుకి). 'మొన్న పెళ్ళిలో ఏం జరిగిందా?' అని నేను నా ఫ్లాష్ మెమొరీని స్కాన్ చేయడం మొదలుపెట్టా. 'ఏమైందిరా?' అన్నట్టు భగవాన్ చూశాడు. బగ్గు ఐతే నో చూపులు..జస్ట్ డైలాగ్స్.."ఏంట్రా..!! ఎనీథింగ్.." అంటూ కన్ను కొట్టాడు. సుమ్మీ గాడు నావైపు చూశాడు నేనేదో చేసినట్టు..! నేను ఉలిక్కిపడి "డార్లింగ్ నాకేం తెలియదురా...!" అనేసా, 'స్వాతిముత్యం'లో కమల్ హాసన్‌లా..!! "యెహె నమ్మేసాం కాని నువ్వు మ్యాటర్ కి రారా.." అంటూ సత్తి గాడు సుమ్మీ వైపు చూసాడు. చిన్న చిరునవ్వుతో 'విషయంలోని విశేషమేంటో విలంబించక వివరించమని' వ్యక్తపరిచాడు రెడ్డి. ఇంత సీన్ అవసరమా అన్నట్టు నేను వాడిని చూస్తుంటే ఇంక చెప్పడం మొదలుపెట్టాడు. 

"ఏం లేదురా, మొన్న పెళ్ళికి వెళ్ళాం కదా, అక్కడ కపుల్ ని చూసి ఇద్దరం ఒకటే ఫీల్ అయ్యాం 'పెర్ఫెక్ట్' అని. మామా! నిజంరా.. వాళ్ళిద్దరూ ఎక్కడా కొత్తగా పరిచయమైనట్టు లేరురా..! మేం ఫోటో దిగాం కదా అప్పుడు చక్కగా ఒకరిచేతులు ఒకరు పట్టుకొని... అబ్బా.. ఇట్స్ ఎ స్ట్రేంజ్ ఫీల్ రా..!!" అంటూ సుమ్మీ గాడు నామీద పడిపోయాడు. ఏనుగుపిల్ల కింద పడిన బల్లిపిల్లలా ఉంది నా పరిస్థితి. అతికష్టమ్మీద రెండు చేతులతో వాడిని తోస్తూ ఉంటే, సత్తిబాబు డిక్లేర్ చేసాడు "ఏమైనా లవ్ మ్యారేజ్ కంటే అరేంజ్‌డ్ మ్యారేజే బెస్ట్ రా..!".భగవాన్ వేంనే రెస్పాండ్ అయ్యాడు, "అంతేం లేదు, మామా అసలేం తెలియకుండా ఒక స్ట్రేంజెర్ ని ఎలారా..!!??". "మరీ అంత ఇష్టాయిష్టాలు తెలుసుకోకుండా ఎలా చేసుకుంటారులేరా..!" పాత సినిమాలో హీరోలా భారంగా అన్నాన్నేను

"నువ్వెన్నైనా చెప్పు డార్లింగ్! లవ్ మ్యారేజ్ బెస్ట్ రా" చేత్తో ఫైనలైజ్ చేశేసాడు బగ్గు. "అవుననుకో బాబాయ్, కానీ ఈ లవ్వు గివ్వు అంటే కష్టమేరా...!" బెంచ్కి ఆనుకుంటూ చెప్పాడు సుమ్మీ. 'ఇవన్నీ ఎందుకురా ఇంట్లోవాళ్ళు చూపించిన పిల్లని చేసుకోవడం మంచిది' అన్నట్టు చూసాడు రెడ్డి. ఇలా ఒక పావుగంట పైగానే మాట(దెబ్బ)లాడుకున్నాం. ఇంక ఇలాగే వదిలేస్తే కష్టం అని ఫీల్ అయ్యి క్లించ్ ఇచ్చా, "అరేయ్ మామా! కూల్ రా, ఏ పెళ్ళైనా ముందు ఒకరి భావాలు ఒకరికి నచ్చాలి కదరా... సెల్ఫ్ అండ్ మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండాలి కదా..!.." అంటూ ఒక ఐదు నిమిషాలు మాట్లాడా, ఏదో గత జన్మలో పది-పదిహేను పెళ్ళిళ్ళు అయినోడిలా..! ;-) 

ఇంతలో క్లాస్ అంతా అలెర్ట్ ఐంది... ఆర్.ఎఫ్. క్లాస్ మొదలయ్యింది... మా బోర్డ్ మీటింగ్ ఐపోయింది. మేం నెమ్మదిగా మూడో బెంచ్కి జారుకున్నాం. సార్ బోర్డువైపు (మా బోర్డ్ కాదులెండి..బ్లాక్‌బోర్డ్) తిరిగి చాక్ తో రాసారు.."Two cavity klystron". సత్తిబాబు వేసిన జోక్‌కి వస్తున్న నవ్వుని ఆపుకుంటుంటే వెనక నుంచి భగవాన్ 'కళ్యాణమస్తు' అన్నాడు..

22, నవంబర్ 2008, శనివారం

కలలు కంటాను నేనీవేళ

అరవిరిసిన అందాలను దాచుకున్న ప్రకృతి
లలితమైన నవ్వులనే చల్లని పవనంతో
ఈ మదిని తాకినపుడు.., వెల్లువలా ఉప్పొంగే
కవితా ప్రవాహం ఈ హృదయపు
హద్దులు దాటి ఉరకలేస్తుంటే.. "ఆమనీ
యేమని పాడెద" అంటూ నివ్వెరపోయాను..!!
అరుణోదయాన...అందమైన కల కన్నాను..!!

8, నవంబర్ 2008, శనివారం

ఓ సారూ! జరా యినుకో

మూన్నెల్ల సంది చూత్తానే ఉండా
యావైనా చెప్తావేమో ని
నీ చెప్పుడు తో సబ్జెక్టుకే
బద్నాం తెచ్చినావ్..!!
ఒక్కో యూనిట్టుకి
దినాలు వదిలి
నెలల్లెక్క లాక్కుండావ్...!
కండ్లు తెరిసి చూసే తాడికి
పూరా కతమన్నావ్..!!
యింకేముండాది...
మిడ్డు..బొడ్డు.. అని
చానా రాసినాం
గంతే...
నాల్గు దినాల్లో
చివరాకరి ఎజ్జాములు..!!
................................
మావోడు పరీచ్చకెల్లె
ముందే అడిగిండు..
"యామిరా బై..!గా
సాంప్లింగు సదివిన్రా..?" అని
యాలాకోలమాడబాకని..
ఆడ్ని కాతరు చెయ్యలా..!!
నాకేమెరుక..
గా పేపరిచ్చేటోడు
నీ ఇలాకల్నే
ఉండాడని...!
తేజ సైన్మాల్లెక్క
అర్దంగాని తరీకలో ఇచ్చిండు..!
గంతెందుకు సారూ...!
నువ్వు రాసినాగూడా
పాసవ్వుట కష్టమే
ఎరుకనా..!!
.........................
సారూ..!
గీ జిందగీకిది చాలు
మల్లొచ్చి పరేషాన్ చెయ్యబాకు...!!
యాదుంచుకో...!!!

6, నవంబర్ 2008, గురువారం

మహా ప్రస్థానం

మాకు (బి.టెక్) ఫస్ట్ ఇయర్ లో.. ఉదయం 7-30 కి క్లాసెస్ స్టార్ట్ అయ్యేవి...... సో మాకు 5-50 కే బస్సులు బయలుదేరేవి... అసలే చలికాలం..ఆ చలిలో, ఆ చీకటిలో....మా కాలేజ్ కి వెళ్ళే ఈ చిన్ని (అంటే ఒక గంట పడుతుంది :-)) ) ట్రావెల్ ని ఇలా రాసుకున్నా... :-)
-----------------------------------------------------------------------------------------------
పొద్దున్నే... సూర్యుడైనా మేల్కోని
ఆ చీకటిలో... సెల్ లో అలారం...!
కొన్నిసార్లు అదే కల...
లేచి రెడీ అవుతున్నట్లు..
ఇంతలో రెండో అలారం...!!
లేవాలనిపించదు, కానీ
లెగవక తప్పదు....!!
నెమ్మదిగా లేచి,
అతి నెమ్మదిగా తయారయ్యి...
ఇల్లు దాటితే...
బస్సు పది నిమిషాలు లేటు..!
ఎప్పుడూ కాదు..అలాగని
అప్పుడప్పుడూ కాదు....!
బస్సు తెచ్చాం, ఇహ
ఎక్కడం మీ వంతు
అన్నట్టు - డ్రైవరు హారను...!
అది వింటూ...
(చిరాకు పడుతూనే...!)
చేతిలో మూడు కేజీల బరువుతో...
బస్సు ఎక్కి,
కిటికీ పక్కన కూర్చొని.....
బస్సు అలా సాగిపోతుంటే..
ఇంటర్ కాలేజీ వైపు చూస్తూ
ఇది అనుబంధమో.....
వీడిన బంధమో...!!??
అనుకుంటూ..
అది అలా నా నుండి
దూరంగా సాగిపోతుంటే...
"నేనున్నాననీ" అంటూ...
తర్వాతిస్టాపులో ఫ్రెండు...
వాడికోసం నా పక్క సీటు రెజర్వుడు..!
రాగానే వాడి వాక్‌ప్రవాహం
వరద గోదారిలా సాగిపోతుంటే...
ఇంతలో హఠాత్తుగా గుర్తుకొచ్చే
ఇంగ్లీషు హోంవర్కు...
కాదు..., బస్‌వర్కు.....!!!
హైవే మీద, హై స్పీడులో
వీచేగాలిని సైతం భయపెడుతూ...
(ఔను సైకిలుతో పోటీ పడుతూ.... :-) )
రెండో గేరు గుర్తెరుగని
మా రధసారథి సారథ్యంలో
బస్సు దూసుకుపొతుంటే...
ఐ. ఏ. యస్. రాసేవారిలా..,
ఐ. ఐ. యం. లో చేరేవారిలా...
ఆ పుస్తకం తీసి
తేరిపారా చూసేసరికి,
హఠాత్తుగా కాకపోయినా
తెలిసినట్టుగా
మధ్యలో ఈ టోల్‌గేటు...!
ఆ స్పీడు బ్రేకర్లు..
స్పీడుగా వెళ్ళేవాళ్ళకే కాదు
మా బండికీ ఇబ్బందే...!!
ఇహ అంతా వచ్చినట్టుగా
పుస్తకాన్ని తీసి లోన పెట్టి..,
కిటికీలోంచి బైటకి చూస్తూ.....,
వణికించే చలిని సైతం
లెక్క చేయక.. కిటికీ తలుపులు
పూర్తిగా తెరిచి,
ఆదమరచి
నిద్దరోయే ముందువాణ్ణి
మనసులోనే తిట్టుకుంటూ....
ప్రదోష సమయంలో..
ప్రకృతి అందాలని ఆస్వాదిస్తూ
నాలో నేనే ఉప్పొంగిపోతుంటే...
హఠాత్తుగా బైపాస్..!!
అంబాసిడర్ మాత్రమే
నడవగలిగే మహాద్భుత
అంతర్జాతీయ రహదారి :-)
పచ్చని పొలలే.. చుట్టూ
అవునుమరి
గ్రీన్ ఫీల్డ్ కదా..!!
మా రథం రణరంగాన్ని చేరగానే
మారథాన్‌లందరూ సిద్ధం,
లాంగ్‌మార్చ్ కి...!!
'మావో'ది కాదు...మాది...!!
అవును మరి....
ఒక ఊరు దాటాక మా క్యాంపస్...!
ఫ్రెష్‌మ్యాన్ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్..
మూడంతస్థుల భవనం..
పెద్దదే.....!!
ఆ సౌధపు స్టెప్పులపై
స్టెప్పులు వెస్తూ...
స్టెయిర్లు ఎక్కుతూ...!!
సారీ! ఇక్కడితో తెలుగుకి ఫుల్‌స్టాప్.
నో తెలుగు...
ఓన్లీ వింగ్లీస్...
దట్సాల్....!!! :-)

30, అక్టోబర్ 2008, గురువారం

అప్పుడే తెల్లవారాలా....?

నా కనుబొమ్మల
చల్లని తెరల మీద
మృదువైన స్వప్నంతో
నీ బొమ్మని గీద్దామని
అనుకుంటున్న వేళ.....
అప్పుడే తెల్లవారాలా...!!!
నా కల చెదరాలా...???

5, అక్టోబర్ 2008, ఆదివారం

డియర్ సార్! This is my number

లాస్ట్ పోస్ట్‌లో చెప్పిన లక్ష్మీ సార్ క్లాస్‌లోనే ఇది కూడా రాసింది. సార్ క్లాసులో ఎంత గొడవ చేసినా అరిచేవారు కాదు. స్ట్రిక్ట్‌గా ఉంటేనే అల్లరిచేసేవాళ్ళు,ఇంక లీనియంట్‌గా ఉంటే ఎందుకాగుతారు.. సో ఆ గొడవకి ఎంతోమంది అటెండన్స్ పోయింది. ఒక రోజు నాది కూడా హుష్‌పటాక్... అప్పుడు రాసుకున్నా ఈ "డియర్ సార్! This is my number"

====================

డియర్ సార్..!
ఇందాక క్లాసు..
అలియాస్ గొడవ
మొదలైన
పావుగంట తర్వాత
ఓ సెక్షన్ అయిపోయింది..
ఏంటో అనుకుంటున్నరా?
ఏం లేదులేండి అటెండెన్స్..!!
ఇంతకీ నా నంబర్ రాలా..!
నాకో డౌట్...!
నా నంబర్ వచ్చిందా!?
మీరు పిలిచారా!?
నాకు వినబడలేదే?
ఎనీ వే..
నాకు మాత్రం మిస్సయ్యింది
టు అవర్స్ అటెండెన్స్...!
వామ్మో..!
2 పెర్సెంటో 3 పెర్సెంటో
ఎంత తగ్గుతాదో...!!
అసలే అటానమస్ స్కీం

ఏం చెయ్యమంటారు..?
మొదట్లో అడక్కూడదనుకున్నా,
ఇంతా ఆలోచించాక
అడక్క తప్పదనుకున్నా...

అందుకే అడుగుతున్నా...
డియర్ సార్..
This is my number.....!!

డియర్ సార్ - I am very sorry

"లక్ష్మీ నారాయణ" సార్..2-2 లో మాకు AEC సబ్జెక్ట్ తీస్కున్నారు..! సార్‌కి experience ఎక్కువ. కానీ.. సార్ వాయిస్ లాస్ట్ బెంచెస్ కి వినబడేది కాదు.. అందుకని ముందుకొచ్చి కూర్చోవాల్సి వచ్చేది..!!ఒకరోజు అలాగే ముందుకొచ్చి కూర్చున్నప్పుడు లాస్ట్ sem లో గంగా సార్ (EDC) వదిలేసిన టాపిక్స్ అన్నీ మేము అప్పుడే నేర్చుకున్నామనుకొని  సార్ కూడా స్కిప్ చేసేశారు... అప్పుడు రాసుకున్నదీ కవిత.."డియర్ సార్!I am very Sorry"
=====================
డియర్ సార్..!
మొదటిసారి 
మీ క్లాసు విందామని 
తప్పని తెల్సినా.. 
తప్పక..... 
మధ్య రో..లో 
మూడో బెంచిలో 
మూలన కూర్చున్నా..!! 
A4 షీట్స్ 
పద్నాల్గు తెచ్చుకున్నా! 
కొత్త పెన్ను కొనుక్కున్నా! 
చెప్పాలంటే సిగ్గేస్తోంది...! 
మీరు చెప్పేది బుర్రకెక్కలని 
తలకి నూనెకూడా పెట్టా!! 
11:05 క్లాసుకి 
10:55 కే వచ్చా.. 
అటెండెన్స్ కూడా 
అటెన్షన్‌తో చెప్పా..! 
కానీ..., 
మా 'గంగా' వదిలేసిన.. 
అదే ఆయనకీ మాకూ రాని 
(వారి భాషలో unimportant) 
టాపిక్సన్నీ 
మీరు కూడా వదిలేస్తే...! 
అర్థమయ్యేదెలా? 
మీ భాష అరవమైంది. 
పరిస్థితి అర్థమైంది.. 

కానీ... 
వెనక్కి వెళ్ళలేను..! 
అలాగని 
మీ క్లాసు వినలేను...!!  

తెలిసి తెలిసీ.. 
మొదటిసారి.. 
ఓ తప్పు చేశా..!!  

మీ క్లాసు విందామని 
తప్పని తెల్సినా 
తప్పక.... 
మధ్య రో..లో 
మూడో బెంచిలో 
మూలన కూర్చున్నా..!! 
I am very sorry..!!

28, సెప్టెంబర్ 2008, ఆదివారం

మది సంద్రంలో అలజడులు - unfinished

తుఫాను 
చాలా తీవ్రంగా ఉంది... 
సముద్రతీరాన 
కవ్వించిపోయే పిల్లగాలులు 
ఝంఝా మారుతాలయ్యయి.... 
పాదాల్ని తాకిపోయే అలలు 
మనిషిని మింగేసేలా వస్తున్నాయి.. 
తీరంలో నేనొంటరిని! 
చీకటిలో చినుకుల 
నాస్వాదిద్దామనుకున్నా..! 
చిరుగాలుల సవ్వడి విందామనుకున్నా! 
కానీ! 
యీ తుఫాను... 
యిది చాలా తీవ్రంగా ఉంది...
.......................

NET - ఇదో వల


ఏదో విజ్ఞానప్రదర్శన చేసేందుకు లాస్ట్‌టైం రాసిన పోస్ట్‌ని చదువుతూ... "బాబూ! నువ్వేదో ఒక రోజన్నావ్... అవి చెయ్యాలి, ఇవి చెయ్యాలి తీరికలేదన్నావే..!? ఇంతకీ నెట్ గురించి రాశావా అందులో..అసలు సర్ఫింగ్‌లో టైమే తెలియదే... అలాంటిదాన్ని మర్చేపోతే ఎట్లా నాయనా..!అసలు నువ్వు నెటిజెన్‌వేనా..!!?" అని ఓ ఫ్రెండ్ అడిగేదాకా నాకూ గుర్తే రాలేదు..'అరె! నెట్ లేదా నా మాటల్లో.... అదీ ఒక ఫుల్ డే లో' అనుకొని గర్వభంగపాటుని భరింపలేక ల్యాపీ తీస్కొని ఇదిగో ఇలా రాయడం మొదలుపెట్టా....! 
------------------------------------- 
మూడో క్లాసు పిల్లాణ్ణి ఆపి అడిగినా చెప్తాడు 'నెట్' అంటే "వల" అని. ఆ చింటూ గాడు ఏదనుకొని చెప్పినా మనం ఫీలయ్యే మీనింగే చెప్తాడు.. నిజంగా నెట్టో వల.. సర్ఫింగూ, సెర్చింగూ, బ్లాగింగూ, స్క్రాపింగూ... ఇలా చెప్తూపోతే అబ్బో చాలానే ఉంటాయిలే..!! చూశారా మళ్ళీ మర్చిపోయాను. అదేనండీ పైన రాసిన ఇంగుల్లో.. ఇంకో ఇంపార్టెంట్ ఇంగ్.....'చాటింగ్' :-) దీనికిగాని క్యాప్షన్ పెట్టమంటే నా ఓటు .... "ఫెవికాల్"కే..

system స్టార్ట్ చెయ్యగానే ఆటోమ్యాటిగ్గా start-up లో ఉండే ఆ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ కాస్తా అలా start ఐపోయి....అలా అలా YM కాస్తా ఓపెన్ అయిపోయి...(ఆల్రెడీ 'ఆటోమాటిక్ లాగిన్' క్లిక్ చేసుంటుందిలెండి)..! ఇంకేముంది, అలా అలా అలా... hi..hii..hahahai అనే పాపప్స్ ...

ఇంక గడియారంలో ముల్లు .. మున్నాభాయ్‌లో చెప్పినట్టు పరిగెడుతుంది చూడండి.. గంటలు నిమిషాలు కాదుకదా సెకన్లు అవుతాయి. ఇవి చాలక గూగుల్ chrome ఒకటి, ఓపెన్ చెయ్యగానే ఆర్కుట్ ప్రొఫైల్ thumnailలో కనబడేసరికి కర్సర్ కాస్తా అటువెళ్ళిపోతుంది...(అదేగా వల) ఇక్కడ మళ్ళీ స్క్రాపులూ.. అప్‌కమింగ్ బర్త్‌డేసూ.. న్యూ ఫ్రెండ్ రెక్వెస్ట్సూ....... సారీ వీటి గురించి మొదలుపెడితే మళ్ళీ ఓ కొత్త పోస్టు రెడీ అవుతుంది..  

మరి ఇన్ని విషయాలు తెలిసినా మళ్ళీ మళ్ళీ నెట్‌కి కనెక్ట్ అవుతున్నామే....! ఇదే కదండీ వల అంటే.... :-)

21, సెప్టెంబర్ 2008, ఆదివారం

అనగనగానో...అనుకోకుండానో... మొత్తానికి ఓ రోజు!!

ఎవరు రాశారోగానీ...
"కాలేజి లైఫురా, తెలియనోడు వేస్టురా..." అనీ
కనబడితే మాత్రం కొట్టేద్దామనిపిస్తుంది. అసలాయనకి తెలుసా, కాలేజి లైఫేంటో..!?

ఎవరికన్నా ఆరు రోజులు పనిచేశాక హాయిగా రెస్ట్ తీస్కునేందుకు ఓ హాలిడే...యీ సండే..!

ఓ చక్కని మార్నింగ్ కాఫీతో స్టార్ట్ చేసి,
తీరిగ్గా టీవీ ముందు కూర్చొని,
మార్నింగ్ మార్నింగే మార్నింగ్‌షో మొదలెట్టేసి,
బోరుకొట్టే టైముకి..(ఆకలేసే టైముకి)..
డైనింగ్ టేబుల్ మీద చిన్న యుద్ధం చేసి,
సోఫాలో హాయిగా వెనక్కివాలి,
టీపాయ్ మీద కాళ్ళు పెట్టుకొని,
ఓ చిన్న కునుకుతీసి,
మళ్ళీ ఫస్ట్ షో మొదలెట్టడానికి ముందు లైట్‌గా టీ తీస్కొని,
టీవీ ముందుకొచ్చేసరికి...
ఫోన్లో ఫ్రెండ్స్ సిన్మా ప్లాన్ తీసుకొస్తే,
హడావుడిగా రెడీ ఐపోయి..
థియేటర్ దగ్గర ప్రత్యక్ష్యమయ్యేసరికి..
ఫ్రెండ్స్ టిక్కెట్స్‌తో రెడీగావుంటే,
రిలాక్స్‌డ్‌గా మూవీ చూసి,
ఇంటికొచ్చేసరికి...
వేడి వేడిగా నీళ్ళు రెడీ ఐపోతే..
తీరిగ్గా జలకాలాడి,
ముందట్లా కాక.. ప్రశాంతంగానే డిన్నర్ చేసి,
మళ్ళీ సెకండ్‌షో మొదలెడదామనుకున్నా...
కళ్ళు మూతలుపడుతుంటే,
అలాగే వచ్చి మంచంమీద వాలిపోయి
హాయిగా నిద్రపోవాలని ఎవరికుండదు...!?

అరె.. ఒక్కరోజులో ఇవన్నీ కంప్లీట్ చెయ్యడమే కష్టం అనుకుంటుంటే,
ఇంక స్టూడెంట్ బుక్‌లో,
కాలేజ్ చాప్టర్‌లో,
అందులోనూ సెమిస్టర్ ఎండింగ్ పేజ్‌లో మరీ కష్టం...
హఠాత్తుగా వచ్చేసే సెషనల్స్, ల్యాబ్ ఇంటర్నల్స్...
చివరగా డ్రాకులాలా... sem-end exams .... ఇంక తీరికెక్కడిది..?
అలాంటప్పుదు పైన చెప్పిన పనుల్లో ఒక్క కాఫీ తాగడమే మిగుల్తుంది... అదీ నిద్రమత్తుపోయి నైటౌట్ చెయ్యడానికి....!!

అందుకనే ఎప్పుడైనా స్టూడెంట్ లైఫ్ గురించి పాటలు పాడినా ఒప్పుకుంటా గానీ...,యీ టైంలో... చచ్చినా ఒప్పుకోను..!!

ఎందుకంటే యిక్కడ హాయిగా ఎంజాయ్ చేద్దాం అనికాదు...
అనగనగా అని చెప్పుకోడానికో..
అనుకోకుండా అని చెప్పుకోడానికో..
ఓ రోజు ఉంది అంతే........ :-))

14, సెప్టెంబర్ 2008, ఆదివారం

ఓ వెండి వెన్నెలా

"ఓ వెండి వెన్నెలా...!
దిగిరాయిలా...
అమ్మకొంగులో చంటిపాపలా
మబ్బు చాటునే ఉంటే యెలా...!!"

నిజంగా ఎంత చక్కని భావన...!
స్పందించే మనసున్న ఎవరికైనా ఇంతేనేమో
వెన్నెలని చూడగానే అలాగే మదిలోని భావాలు
కాగితం మీదకొచ్చెస్తాయేమో
..................
యెన్నో భావాలు... యెన్నో అనుభవాలు.. అన్నీ
ఓ వెన్నెలా! నీ సొంతమే

"వెన్నెలా.. వెన్నెలా..
మెల్లగా రావే
పూల తేనెలే తేవే..."
అంటూ ప్రియురాల్ని చంటిపాపలా నిద్దరోమని పాడే ఆ ప్రియుని పాటలో

"ఓ వెన్నెల సోనా... నిను చేరగ రానా...."
అంటూ నెచ్చెలిని వెన్నెల వర్షంతో పొల్చే ఆ భావనలో

"వెన్నెలవే.. వెన్నెలవే.., మిన్నే దాటి వస్తావా?"
అని దరిచేరమనే భావనను కల్గించిన ఓ ప్రేమికుడి మనవిలో..

"చల్లని వెన్నెలలో,
సాగరతీరాన,
వచ్చే పోయే అలల్ని చూస్తూ
నీతో గడిపేయాలని ఉంది"
అనుకునే ఓ చిన్నదాని ఊహలో....
యిలా ప్రతీ ప్రేమ భావనలోనూ..
ఓ వెన్నెలా...!నీ ఊసులే

"వెన్నెల్లో గోదారి అందం"
అని మది పొరల్లో దాగున్న భావాల్ని పాడుకున్న ఓ సితార పలుకుల్లో

"వెన్నెల్లో హాయ్ హాయ్..."
అని ఆనాందాన్ని తెలియపరిచే ఓ బ్యాచిలర్ లిరిక్స్‌లో
యిలా ప్రతి ఆనందం వెనుకా ప్రతి బాధ వెనుకా...
ఓ వెన్నెలా..! నీ తలపులే..

అప్పుడప్పుడూ నాకూ అనిపిస్తుంది..
"వెన్నెలలో
చల్లని పిల్ల తెమ్మెరల పలకరింపులలో
కమ్మని పాటలు వింటూ...
రాత్రినంతా గడిపేయాలని...!"
ఓ వెన్నెలా..! చూశావా.., నేను కూడా తప్పించుకోలేకపోయను..
నీ నుండి..! :-)

3, సెప్టెంబర్ 2008, బుధవారం

ఐనా మనసు మాట వినదు

ప్రశాంతంగా... ఏకాంతంగా... ఆత్మీయంగా... అవిరామంగా... నీతో మటాడాలని..! వడి వడిగా వచ్చి నీ నవ్వుల వెన్నెలలో తడిసిపోవాలని నీ మాటల ఝరిలో మునిగిపోవాలని ప్రపంచాన్ని పక్కనపెట్టి నా కళ్ళల్లో నిన్ను కట్టి నిన్నే చూస్తూండాలని... ద్యుతిని గెలిచి స్థితిని మరచి... నిన్ను చేరుకోవాలని....! ఒక చిన్ని ఆశ...!! తగదని ఎంత చెప్పినా ... నా మనసు మాట వినదు...